Elementary Education: భారత దేశంలో ప్రాథమిక విద్యా ప్రస్థానం 1 y ago
మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు సాందీపు మహాముని ఆశ్రమం వద్ద విధ్యనభ్యసించారు. కౌరవ, పాండవులు ద్రోణాచార్యుని వద్ద నేర్చుకున్నారు. ప్రాచీన భారత దేశంలో గురుకుల విద్యా విధానాలు ఉండేవి. గురుకులాలు హిందూ సాంప్రదాయాల విద్యా కేంద్రాలు. ఇవి గురుకుల పాఠశాలలు లాంటివి. సాధారణంగా ఇవి ఉపాధ్యాయుని ఇల్లు లేదా ఋషి పుంగవుల నివాస గృహాలు. గురుకులాల్లో గురువులు ధర్మం, గ్రంథాలకి సంబందించిన విషయాలు, హిందూ తత్వం గురించి, సంస్కృత సాహిత్యం, యుద్ధ విద్యలు, జ్యోతిష్య శాస్త్రాలు, ఇతిహాసాలు బోధించేవారు. బ్రాహ్మణ, క్షత్రియులకు మాత్రమే ఈ గురుకులాలలో విద్య లభించేది. చదువుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే ఎన్నీ అడ్డంకులు ఎదురైనా ఖచ్చితంగా చదువు నేర్చుకుంటారు అనడానికి ఉదాహరణగా ఏకలవ్యుడుని చెప్పవచ్చు. ద్రోణాచార్యుడు ప్రతిరూపాన్ని ప్రతిమగా చేసుకొని విలు విద్యను నేర్చుకొన్న గొప్ప వ్యక్తి ఏకలవ్యుడు.
భారతదేశంలో ప్రాథమిక విద్య….
భారతదేశ విద్యా వ్యవస్థ భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖ పరిధిలోకి వస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నోడల్ విభాగం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విభాగం (DEE). భారతదేశంలోని విద్యా వ్యవస్థలు ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. భారత దేశంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలోనిది. భారతదేశంలో ప్రాథమిక విద్య కాలవ్యవధి 8 సంవత్సరాలు. ఉపాధ్యాయులు బోధన-అభ్యాస ప్రక్రియలో సూచించే పద్ధతులు, ఫీల్డ్ ట్రిప్‌లు, ప్లే వే పద్ధతులు మొదలైనవి. విద్యార్ధులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు సహాయపడతారు. ఉపాధ్యాయులు పిల్లలని శారీరకంగా దండించకుండా, పూర్తిగా ప్రేమ, ఆప్యాయతలతో వ్యవహరిస్తారు.
ప్రాథమిక విద్య అంటే
ప్రాథమిక విద్య అనేది చదువు మొదటి దశ. ప్రీ స్కూల్ లేక కిండర్ గార్డెన్ తర్వాత మాధ్యమిక పాఠశాలకు ముందు వస్తుంది. ప్రాథమిక విద్యా స్ధాయి నుండే పిల్లల్లో దేశభక్తి, నైతికత అనే లక్షణాలు వృద్ది చేయడం, పెద్దలతో గౌరవంగా మాట్లాడడం నేర్పిస్తారు. ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులకు విద్యలో సమాన హక్కులు కల్పించారు. జీవన నాణ్యతను ఎలా చక్కదిద్దుకోవాలో ఎలిమెంటరీ విద్య నేర్పుతుంది. ఒక విద్యార్థి సరైన మార్గంలో నడవడానికి దారి చూపిస్తుంది. ప్రాథమిక విద్య పిల్లలను ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా, శారీరకంగా అభివృద్ధి పరుస్తుంది. ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు చదివే విద్యను ప్రాథమిక విద్య అంటారు.
పిల్లల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రాథమిక విద్య కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞానంతో వ్యక్తులను శక్తివంతం చేయడం, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో ప్రాథమిక విద్య కీలకమైన సాధనం. ప్రతి బిడ్డ అభివృద్ధి చెందే వాతావరణాన్ని ప్రాథమిక స్థాయి నుంచే సృష్టించవచ్చు. ప్రాథమిక విద్య అనేది ఒక విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తుంది.
ప్రాథమిక విద్య ప్రధాన లక్ష్యాలు
భారతదేశంలో ప్రాథమిక విద్య ప్రాథమిక లక్ష్యం పిల్లల అక్షరాస్యత నైపుణ్యాలను పెంపొందించడం. పిల్లల మనోభావాలను వ్యక్త పరచడానికి ప్రాథమిక విద్య కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాథమికంగా నేర్చుకునే చదువు, విద్యార్థులను తదుపరి విద్య, జీవితకాల అభ్యాసానికి సిద్ధం చేయడం. భారతదేశ స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం రూపొందించిన చట్టాల్లో బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కుచట్టం అతి ముఖ్యమైంది. ఈ చట్టం దేశ ప్రగతిలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. రాష్ట్రంలోని బడులన్ని RTE-2009 చట్ట ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది.
ఆర్టీఈ యాక్ట్ - 2009
ఆర్టీఈ (Right to Education Act) అంటే విద్యను ఒక హక్కుగా భావించడం. కుల, మత, జాతి బేధాలు లేకుండా విద్యా హక్కు చట్టం పార్లమెంట్లో 2009 ఆగస్టున ఆమోదించబడింది. 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 2002లో జరిగిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A అనేది 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత విద్యను అందించాలని సూచిస్తుంది. దీని ద్వారా ఏ విద్యార్థికైనా విద్య అందనట్లయితే హైకోర్టు, సుప్రీం కోర్టుని సంప్రదించవచ్చు. విద్యను ప్రాథమిక హక్కుగా అమలు చేస్తున్న 135 దేశాలలో ఇండియా కూడా ఒకటి. ప్రపంచంలోని చాలా దేశాల్లో విద్యా హక్కు తప్పనిసరి చేయబడింది.
బేటీ బచావో- బేటీ పఢావో
భారతదేశంలో ప్రాథమిక విద్య ముఖ్యమైన లక్ష్యం లింగ సమానత్వం. భారతదేశంలో ప్రాథమిక విద్య లక్ష్యాలు జ్ఞానాన్ని అందించడం. లింగ సమానత్వం, సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా భారతదేశం పిల్లలకు చదువు పట్ల బలమైన పునాదిని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. పిల్లలని దేశ పురోగతికి చురుకైన సహాయకులుగా మారడానికి వారిని శక్తివంతం చేస్తుంది. విద్యలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించి బాలికలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశంలోని బాలికల సంక్షేమం, చదువు కోసం 2015లో హరియాణాలోని పానిపట్‌లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం బేటీ బచావో- బేటీ పఢావో(ఆడ పిల్లను రక్షించండి, ఆడ పిల్లలకు చదువు చెప్పండి).
ఎలిమెంటరీ స్ధాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమం
స్త్రీల అక్షరాస్యత శాతం, జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కవ ఉన్న ప్రాంతాల్లో NPEGEL కార్యక్రమం ప్రత్యేకంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాలికల హాజరు శాతాన్ని మెరుగుపరచడం.
రాజీవ్ విద్యా మిషన్ లో కార్యక్రమాలు
ప్రాథమిక విద్య కోసం సర్వశిక్షా అభియాన్ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమం. ప్రాథమిక విద్య కోసం మధ్యాహ్న భోజన పథకం, అమ్మవడి వంటి అత్యంత విజయవంతమైన కార్యక్రమాలు ఉన్నాయి.
మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ పేరిట సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) ద్వారా కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. ఐదు నుంచి పదేళ్ల వయస్సు గల బాలబాలికలకు కనీసం 25 మంది ఉండి 200 పైగా జనాభా కలిగి ఒక కిలోమీటరు పరిధిలో పాఠశాల లేనట్లయితే నూతన పాఠశాల ఏర్పాటు చేయడం. 5వ తరగతిలో ఉత్తీర్ణులై కనీసం 25 మంది విద్యార్ధులు ఉండి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల లేనట్లయితే ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలందరికి, ఎస్సీ,ఎస్టీ బాలలందరికి అలాగే దారిద్య్ర రేఖ దిగువనున్న బీసీ, ఓసీ బాలికలందరికి, యూనిఫామ్ కొనుగోలుకు సంవత్సరానికి రూ.400 చెల్లిస్తున్నారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి
రాజీవ్ విద్యా మిషన్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పాఠశాలలో చేర్పించే అవకాశం గల పిల్లలను చేర్పించడం, వారిని కొనసాగించుడం, బోధనోపకరణాలు సరఫరా చేయడం, అవసరమైన పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయించడంలో సహాయం అందించడం. వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ పొందిన రిసోర్స్ ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుంది.
జన సాంద్రత తక్కువ ఉన్న ప్రాంతాలు, కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లోని పిల్లలకు, పట్టణాల్లోని మురికి వాడల్లో నివసించే పిల్లలకు, అనాథలు, వీధి బాలల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం. పాఠశాల ఏర్పాటుకు స్థల వసతి లేని ప్రాంతాల్లోని పిల్లల కోసం రవాణా సౌకర్యం కల్పించాలి. పిల్లలు బడిమానేయకుండా ఉండాలంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్)
పేదరికం కారణంగా పాఠశాల మానవేయకూడదనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. 2001 నవంబర్ 28న సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనూ ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలుపరచాలని తీర్పునిచ్చింది. మొదట్లో కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించినా 2005 నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఆకలి, పోషకాహార లోపాన్ని తగ్గించడం. పాఠశాలల్లో పిల్లల నమోదు నిష్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడింది. సమాజంలోని వివిధ వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడంలో ప్రభుత్వం కొంత వరకు విజయవంతమైనప్పటికీ లింగ అసమానతలు, వివక్షత, సామాజిక అసమానతలు, మౌలిక సదుపాయాల లేమి మొదలైన అనేక కారణాల వల్ల నెమ్మదిగా పురోగమనం జరుగుతుంది.
బడిబాట
బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. బడిబయటి పిల్లల్ని బడిలో చేర్పించడం, విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలను శుభ్ర పర్చుకోవడం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం డ్రాపౌట్స్‌ను తగ్గించడమే. బడిబాట కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచడం.
అమ్మబడి....
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి, పేద విద్యార్ధులకు తల్లిదండ్రులకు ఆర్ధిక సాయం చేసేందుకు 2020 జనవరి 9న చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించింది. తెల్ల రేషన్ కార్డు కలిగి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్ధులందరికీ ఏడాదికి రూ. 15,000 ఆర్ధిక సాయం అందించారు.
తరగతి గదిలో విద్యార్ధి, ఉపాధ్యాయుల నిష్పత్తి ఇలా
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. 90 మంది పిల్లలు ఉంటే ముగ్గురు, 120 మంది ఉంటే నలుగురు, 200 మంది ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. 200 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రతి నలభై మంది విద్యార్ధులకి ఒక ఉపాధ్యాయుడితో పాటు ఒక హెచ్ఎం ఉండాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కనీసం 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
ప్రాథమిక విద్యలో బోధన సమయం
ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉపాధ్యాయులు రెండొందలు రోజులు బోధించాలి. ఒక టీచర్ వారంలో 45 గంటలు పని చేయాలి.
ప్రస్తుత ప్రభుత్వ విద్యావిధానాలు
గత ప్రభుత్వం విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను తీసుకొచ్చింది. ఆంగ్ల భాషలోనూ విద్యార్థులు రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. రెండు మాధ్యమాల్లో పాఠ్యాంశాలు ఉండటం ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధన సులభతరం అయ్యింది. ఈ పాఠ్య పుస్తకాలను సరికొత్తగా ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలుండేలా ద్విభాషా విధానాన్ని తీసుకొచ్చింది.
ముగింపు
మాతృ భాషలో ప్రాథమిక విద్యా బోధన వల్ల చదవడం, రాయడం సులభతరంగా ఉంటుంది. విద్యా సంస్థలు విద్యార్థులను విజ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత, సమాచార సముద్రం వైపు నడిపించే అభయారణ్యాలాంటివి. ప్రాథమిక స్ధాయి నుంచే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతాయి. పిల్లల వివిధ నైపుణ్యాలని, ప్రతిభను గుర్తిస్తాయి.